ముకున్దమాల
చాలా రోజులనుంచి ముకుందమాలను నేర్చుకోవాలనుకుంటున్నానుగానీ పూర్తి ప్రయత్నం మాత్రం చేయలేదు.చూడగానే చాలా క్లిష్టమైన శ్లోకాలుగా అనిపించడం వల్లనేమో తెలియదు.శ్రీ అష్టాక్షరి సంపత్కుమార రామాజున జియ్యర్ స్వామివారు ముకుందమాల గొప్పదనాన్ని వివరించి మీరందరూ నేను మిమ్మల్ని మళ్ళీ కలిసినప్పటికి మీరు నేర్చుకొని ఉండాలని చెప్పారు.గురువాజ్ఞననుసరించి ఇక నేర్చుకోవడం మొదలుపెట్టాను.
ముకున్ద మాల స్తోత్రమాలికను అందంగా గుదిగుచ్చిన మహానుభావులు మలయాళ దేశాధీశ్వరుడైన కులశేఖర మహారాజు. ఈ వైష్ణవ భక్తాగ్రేసరుని భక్తి సుధాప్రవాహమే ముకుందమాలగా రూపుదిద్దుకుంది.ముకున్దః అనే భగవన్నామాన్ని అనుసంధించి ముకుందుని విషయంగా రచించిన పద్యాలనే పుష్పాలహారంగా ముకున్దునికి సమర్పింపబడి ముకున్ద మాలగా పేరుగాంచింది.
కులశేఖరులు శ్రీవైష్ణవ ఆళ్వారులలో ఐదవవారు. చంద్రవంశపు రాజైన దృఢవ్రతుడు వీరి తండ్రి. కేరళలోని కొల్లి పట్టణం వీరి జన్మస్థలం. కులశేఖరాళ్వారును, శ్రీవైష్ణవులు మహావిష్ణువు యొక్క కౌస్తుభమణి అవతారంగా భావిస్తారు.వీరికి భగవంతుని గాథలన్నా, భక్తులన్నా చాలా ఇష్టం.నిరంతరం శ్రీనివాసుని దివ్యమంగళ విగ్రహం చూడటానికి తాను శ్రీవారి ముంగిట గడుపుతూ స్వామివారిణి తనివితీరా చూసే భాగ్యం కలుగుతుందని పరితపించాడు. అందుకే తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి గర్భాలయానికి ఉన్న గడపకు కులశేఖర పడి (గడప) అనే పేరు వచ్చింది.
ఈ ముకున్దమాలను నిత్యపారాయణం చేసే భక్తులకు ఎంతో శ్రేయస్సు కలుగుతుంది.ముకున్దుని కృపాకటాక్షం లభిస్తుంది. మరింకెందుకాలస్యం కానివ్వండి మరి.


కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి